3వ జ్ఞాన పీఠ్ బహుమతి గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ్ కు అభినందనలు.  

సుప్రసిద్ధ రచయిత  శ్రీ రావూరి భరద్వాజకు దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్‌ లభించింది. . విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తర్వాత జ్ఞానపీఠ్‌ అవార్డును పొందిన తెలుగు రచయితల్లో భరద్వాజ మూడో వ్యక్తి.  సుమారు పాతిక సంవత్సరాల తరువాత మన తెలుగు కవికి "పాకుడురాళ్ళు" అనే నవలకు ప్రఖ్యాత జ్ఞాన పీఠ్   పురస్కారం లభించడం తెలుగువారిమైన మనందరికీ గర్వ కారణం.

1927 జులై 5న పరిటాల జాగీరులోని మోగులూరు గ్రామం(ఇప్పటి కృష్ణాజిల్లా నందిగామ తాలుక)లో రావూరి సుబ్బయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. కొంతకాలం తర్వాత వారి కుటుంబం గుంటూరు జిల్లా తాడికొండకు వలసవెల్లింది.   రావూరి భరద్వాజ 130 గ్రంధాలు వెలువరించారు. కథా రచయితగా ఆయన అపార కీర్తి నార్జించిన ఆయన మొత్తం 24 కథాసంపుటాలు వెలువరించారు. వాటిలో సామాన్యుల సమస్యల నుంచి వియత్నాం దక్షిణాఫ్రికా విముక్తి పోరాటాల వరకూ ప్రతిబింబిస్తాయి. తొమ్మిది నవలలు రాయగా అందులో సినీలోకపు మేడిపండు రూపం చిత్రించిన పాకుడు రాళ్లు గొప్ప పేరు తెచ్చింది. . రావూరి భరద్వాజ రచనల్లో భాష జన జీవితానికి దగ్గరగా వుంటుంది. ఆయన నిత్య జీవితంలోనూ చాలా నిరాడం బరంగా స్నేహశీలంగా మెలుగు తుంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అనేక పురస్కారాలు పొందడమే గాక రచయితగానూ విశేషమైన ప్రఖ్యాతి పొందినా సాహిత్య సభలకు అందరితో పాటు హాజరయ్యే వినమ్రత ప్రదర్శిస్తారు. 8వ తరగతివరకే విద్యనభ్యసించిన భరద్వాజకు రాష్ట్రంలోని 3 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ప్రకటించటం విశేషం. ఆంధ్రా, నాగార్జున, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించాయి. 2009లో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు ఆయనను వరించింది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన భరద్వాజను ఇంకా అనేక అవార్డులు వరించాయి.