A famous letter by  Abraham Lincoln to his son's teacher :-



నాకు తెలుసు - అతను చాలా నేర్చుకోవాలి. మనుషులంతా దయామయులు, నిజాయితీపరులు కారని అతను గ్రహించాలి. అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారనీ, స్వార్ధ రాజకీయవాదులతో పాటు, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నేతలూ ఉంటారని అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి.

నాకు తెలుసు - అతను నేర్చుకోడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఆయాచితంగా లభించిన ఐదు డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనదని అతడు గ్రహించేలా చూడండి. అతనిని ఓటమిని తెలుసుకోనివ్వండి. గెలుపుని ఆనందించడం నేర్పండి. అసూయకు అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే, స్వచ్చమైన నవ్వులోని రహస్యాన్ని అతడికి నేర్పండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి. ప్రకృతిని ,. ముఖ్యంగా నీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను,పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని ,ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయమివ్వండి. మోసం చేయడం కన్నా, విఫలమవడంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి. ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ, తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి. అతను సౌమ్యులతో సౌమ్యంగానూ, కఠినాత్ములతో ధృడంగాను వ్యవహరించేటట్లు చూడండి.

కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా, వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి. ఇతరులు చెప్పేవాన్నీ విని, వాస్తవం అనే చిక్కంలో వడపోసి, వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి. మీకు వీలైతే బాధలలోను అతడు నవ్వగలిగేలా చూడండి. అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి.

నిత్యశంకితులను తిరస్కరించడం అతనికి నేర్పండి. అలాగే అతి మంచితనం
 పట్ల అతడిని అప్రమత్తం చేయండి. తన కష్టానికి, తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయడం అతడికి నేర్పండి. కాని అతను తన హృదయానికి, ఆత్మకి వెలకట్టకుండా చూడండి. అల్లరి మూకల ప్రేలాపనలని పట్టించుకోకుండా, ఎదురొడ్డి పోరడడం అతనికి నేర్పండి. 

అతనితో మృదువుగా వ్యవహరించండి. కాని గారాబం చేయవద్దు. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది. అతడిని ధైర్యంతోను, సహనంతోను మెలగనివ్వండి. నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోడం అతనికి నేర్పండి. అప్పుదే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది. వీటన్నింటిలోను మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి”.

(స్వేచ్చానువాదం! 15 ఏప్రిల్ 2000 నాటి
                   వార్త దినపత్రిక యొక్క మొగ్గ అనే పేజీలో ప్రచురితం)